జీవితంలో మీరు ఏమి సాధించాలనుకున్నా, దానికి మీరు అర్హులై ఉండాలి.
భగవంతుని కృప, అనుగ్రహం పొందాలంటే పాత్రత తప్పనిసరి అనే మాట చాలా మంది గొంతుక దిగదు. అనేక దారులు వెదుకుచూ దైవకృపకోసం ప్రాకులాడుతారే గాని, పాత్రత సంపాదించాలంటే అంగీకరించరు. కానీ జ్ఞానం, వివేకం, శక్తి, భక్తి, ఇలాంటి ఉన్నతమైనవన్నీ దైవం కేవలం పాత్రత కలవారికి మాత్రమే ఇస్తాడని సంత్ జ్ఞానేశ్వర్ బోధ చేస్తుంటాడు.
ఆ మాటలకు ఒక స్త్రీ కోపంతో లేచి పాత్రత చూసి ఇచ్చే పక్షంలో ఇంక దేముని గొప్పతనంమేమున్నది? తన బిడ్డలందరిని సమానంగా చూడలేని ఆ తండ్రి ఒక తండ్రేనా? మానవులలాగే భేద భావమున్న వాడు దేముడేమిటంటూ జ్ఞానేశ్వరుని దుయ్యబడుతుంది. జ్ఞానేశ్వర్ మౌనంగా ఆ రోజు కార్యక్రమాన్ని ముగించివేస్తాడు. మర్నాడొక మూర్ఖుని పిలిచి ఆ మహిళ ఇంటికి వెళ్లి ఆమె బంగారు నగల నొకసారి ఇమ్మని అడగమంటాడు. మూర్ఖుడివి నిన్నెలా నమ్మి ఇస్తానంటూ ఆమె ఆభరణాలివ్వటానికి నిరాకరిస్తుంది.
తరువాత స్వయంగా జ్ఞానేశ్వరే వెళ్లి ఒక్కసారి ఆభరణాలు కావాలని అడుగుతాడు. ఆమె మారు ప్రశ్నించక సొమ్ములన్నింటిని తెచ్చి జ్ఞానేశ్వర్ చేతిలో పెడుతుంది. జ్ఞానేశ్వర్ ఆమె వంక చూసి అమ్మా! చూశావా! నీ సాధారణమైన ఆ భూషణాలనే నా కంటే ముందు వచ్చిన మూర్ఖునికి ఇవ్వటానికి భయపడ్డావు. అటువంటప్పుడు పరమాత్మ తన దివ్య శక్తులను అనాలోచితంగా ఎవరికి పడితే వారికిచ్చేస్తే సృష్టి యేమవుతుందో ఒకసారి ఆలోచించు. కాబట్టి పాత్రత – అపాత్రత, విచక్షణ చూడటం ఆయనకు తప్పనిసరి అని తెలియజేస్తాడు.
బుద్ధ భగవానుని వద్దకు ఒక సేఠ్ ఆత్మజ్ఞాన ప్రాప్తిని కోరి వస్తాడు. స్వయంగా నేనే నీ ఇంటికి వచ్చి తెలియ జేస్తానంటాడు బుద్దుడు. మాట ఇచ్చిన ప్రకారం చెప్పిన సమయానికే బుద్దుడు సేఠ్ ఇంటికి వెళతాడు. బుద్దభగవానుని కోసం ప్రసాదంగా తయారు చేసిన పాయసాన్ని తెచ్చి సేఠ్ అతని ముందు ఉంచుతాడు. ” ఈ కమండలంలో పాయసం పోసి ఇవ్వుమని” బుద్దుడు తన వెంట తీసికెళ్ళిన కమండలాన్ని సేఠ్ కి అందిస్తాడు. ” స్వామి! కమండలం శుభ్రంగాలేదు.
దీనినిండా బుగ్గి పేడ నిండి ఉంది. శుభ్రం చేయకుండా పాయసం చేస్తే ఈ మధురమైన పాయసం మలినమై పోతుంది” అంటూ కమండలాన్ని శుభ్రం చేయటానికి ఉద్యుక్తుడవుతాడు. బుద్ధుడు అతనివంక వాత్సల్యంగా చూస్తూ, “నాయనా!” “ఆత్మ జ్ఞాన ప్రాప్తి అనే మధురాన్ని నీలో నింపాలంటే, ఈ పేడ బుగ్గి రూపంలో నీలో పేరుకుని పోయిన మాలిన్యాలను ముందు కడిగి శుభ్రం చేయాలి. నిన్న నీవు కోరిన కోర్కెకు మార్గం ఇదే. వచ్చిన పని అయిందిగా వెళ్లి వస్తా” నంటూ బుద్దుడు బయలుదేరుతాడు.