Dharma Scholars have stated that the Rule of Duty is the Rule of Dharma.

కర్తవ్య పాలనయే ధర్మపాలనగా ధర్మవేత్తలు పేర్కొన్నారు.

వర్ష ఋతువు ప్రవేశించటానికి ముందుగానే యజ్ఞకర్మకు, వంట చేసుకోవటానికి కావలసిన ఎండు కట్టెలు ప్రోగు చేసుకోవాలని సంకల్పించి కణాదమహర్షి శిష్య సమేతంగా అడవిలో ప్రవేశిస్తాడు. అందరూ కలిసి సామూహికంగా శ్రమించి కట్టెలు కొట్టి కట్టలు కట్టుకుని ఆశ్రమానికి తీసుకుని వస్తారు.

మర్నాడు ఆ అడవిని దాటి ఇంకా ముందుకు పోవాలని శిష్యులు బయలదేరి వెళుతూ ఉండగా ఆ ప్రదేశంలో సుగంధ పరిమళంతో గాలులు వీచసాగాయి. కట్టెలన్నీ కొట్టి వేసిన మోడువారిన అడవిలో ఈ సుగంధమేమిటని శిష్యులు పరికించి చూడగా లోక కళ్యాణార్థం యజ్ఞకర్మ కోసం వారు సామూహికంగా శ్రమించి కట్టెలు కొట్టినపుడు వారి దేహం నుండి రాలిపడిన శ్వేద బిందువుల యొక్క పరిమళంగా వారికి అవగతం మవుతుంది. ఆశ్చర్యానందాలతో పులకితులై వన దేవతకి నమస్కరించి ముందుకు సాగిపోతారు.

కర్మ అందరూ చేస్తారు కానీ సదుద్దేశ్యాలతో జోడించబడితేనే కర్మ యోగంగా మారుతుంది. సాఫల్యం లభించక పోయినాకూడా సదుద్దేశ్యంతో నిర్వర్తించిన కర్తవ్య పాలన సంతోషాన్ని గౌరవాన్ని లభింపచేస్తుంది. దుష్ప్రయోజనాలతో కూడిన కర్మ వల్ల సాఫల్యం లభించినా కూడా ఆత్మగ్లాని లోకనింద వ్యక్తిని దహించి వేస్తుంది.

అంతరిక్షం సూర్య భగవానునితో ఓ దేవా! నీవు నిరంతరం అగ్ని జ్వాలలతో దహించి పోతూ, క్షణకాలం విశ్రమించకుండా పనిచేస్తావు. దీనివల్ల నీకేమిటి లాభం? అని ప్రశ్నిస్తుంది. సూర్యభగవానుడు నవ్వి ఓ పూజ్యురాలా! నేను దహిస్తన్న ఇతరులకు వెలుగును వేడిని ప్రాణశక్తిని ప్రసాదించటం వల్ల అపరిమితమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఆ ఆనందం మరి ఏ ఇతర సుఖ సంతోషాలతోను పోల్చశక్యం కానంత ఉత్కృష్టమైనది అని తెలియజేస్తాడు. అంతరిక్ష సూర్య భగవానునికి శిరసువంచి నమస్కరిస్తుంది.

దీపంలో చమురు అయిపోయి పొడిపత్తి పరిసరాల్లో మసక వెలుతురును ప్రసరిస్తోంది. దీపానికి అంతిమ సమయం ఆసన్నమవడం చూచి ఒక గృహస్థు బాధతో ఓ దీపమా! నీ జీవిత కాలం అంతా వెలుగులు వెదజల్లి ఇతరులకు మార్గదర్శనం చేసి చివరకు ఈ విధంగా దీనంగా నీవు అంతం కావటం చూస్తే నా హృదయం ద్రవించి పోతోంది అంటారు.

ఆరిపోయే దీపం తన శక్తినంతనూ కూడబెట్టి ఆఖరు వెలుగులు వెదజల్లుతూ, ఓ సోదరుడా! ఈ భౌతిక జగత్తులో జన్మ అంటూ లభించిన ప్రతివారికి మరణం ఉండి తీరుతుంది. ఎంత ప్రయత్నించినా మృత్యువు తప్పదు. కాబట్టి లభించిన ఈ అమూల్యమైన జీవిత ఘడియలను ఏమాత్రం వ్యర్థం చేయకుండా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అని తెలియజేస్తూ దీపం అంతిమ శ్వాస తీసుకొంటుంది.

దొంగలు, బందిపోట్లు కూడా కర్మ చేస్తారు ఫలితం పొందుతారు. కాని చివరకు వారి కర్మ దుష్పరిణామాలకే వారిని గురిచేస్తుంది. కర్మ దుష్టత్వంతో కూడిఉండటం వల్ల వారికి తిరస్కారం, దుఃఖం ప్రతిఫలంగా లభిస్తాయి. కాబట్టి అది కర్మ యోగం అని చెప్పటానికి వీల్లేదు.

జయచంద్రుడు మహమద్ గోరితో కలిసి ఫృథ్వీరాజు పథనానికి దోహదం చేస్తాడు. చివరకు అతడుకూడా నశిస్తాడు.

ఇంగ్లిషు వాళ్ళు బెంగాల్ నవాబు సేనాపతి అయిన మీర్జాఫర్ను తమవైపు త్రిప్పుకోవటానికి బెంగాల్కి నవాబుని జేస్తారు. విశ్వాస ఘాతకులైన బ్రిటీష్ వారితో కలిసి అతడు తన నవాబుకి ద్రోహం చేస్తాడు. చివరికు బంధించబడి చంపబడతాడు.

సేఠ్ అమీర్చంద్ భారతదేశంలో గొప్ప ధనవంతుడు. యుద్ధ సన్నాహాల కోసం బ్రిటిష్ వాళ్ళు అతడిని ధనం అప్పుగా ఇవ్వమంటారు. దేశద్రోహం చేసి సేఠ్ వారికి ధనం ఇస్తాడు. ఆ ధన బలంతో వాళ్ళు మనతో అనేక యుద్ధాలు చేసారు. చివరుకు అతడు వారిని తన ధనాన్ని తనకు ఇవ్వుమని కోరగా తిరస్కరించి అవమానిస్తారు. ఆవిధంగా అతడు మరణిస్తాడు.

కానీ ఝాన్సీరాణి బ్రటీష్ వాళ్ళతో పోరాడి రాజ్యాన్ని కోల్పోయి దుఃఖిస్తూ వీరగతిని పొందింది ఆమె ఓడినా చరిత్రలో కర్మయోగిగా శాశ్వతంగా మిగిలిపోయింది.

ఓ పూజనీయుడా! మానవుడు అనేకమైన బాధ్యతలతో బంధింపబడి ఉన్నాడు. కుటుంబ రక్షణ, సమాజ బుణం, శరీరారోగ్యం, మానసిక సంతులనం, సంస్క్రతి ధర్మముల పరిరక్షణ మొదలైన బాధ్యతల నిర్వహణయే కర్తవ్య పాలనగా పేర్కొనబడింది. కర్తవ్య పాలనయే ధర్మపాలనగా ధర్మవేత్తలు పేర్కొన్నారు. “ధర్మం ” అంటే ధారణ చేయటం అని అర్థం. ధారణ చేయాలి? అని ప్రశ్నించుకొన్నప్పుడు శ్రేష్ఠమైన వాటిని జీవితంలో ధరించటమే ధర్మం గా పేర్కొనటం జరిగింది.




Leave a Comment