The true worship of Lakshmi is to earn money ethically and to make good use of what you earn, keeping in mind the benefits and disadvantages.

అసలైన లక్ష్మీ పూజ నీతిగా ధనార్జన చేయటం, ఉచితానుచితాలు దృష్టిలో పెట్టుకొని సంపాదించిన దాన్ని సద్వినియోగం చేయటం.

ఇద్దరు మిత్రులు కలిసి ఆడుతూ పాడుతూ పెరిగి పెద్దవారై మంచి విద్యావంతులవుతారు. ధనవంతుల ఇంటికి చెందినవాడు స్వేచ్ఛగా ధనాన్ని ఖర్చుచేస్తూ విచ్చలవిడిగా తిరుగసాగేడు. రెండవ వ్యక్తి నిర్ధనుల కుటుంబానికి చెందటం వల్ల లభించిన దానిని జాగ్రత్తగా ఖర్చు చేసుకొంటూ ఉన్నత సంస్కారాలతో జీవించసాగేడు. ధనవంతుడు, స్నేహితుని కూడా తనలా ఆనందంగా జీవించుమని ఆహ్వానించేవాడు. పేద స్నేహితుడు అతని ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ, అక్షయసంపద ఉన్నప్పటికి అపవ్యయం తగదని హెచ్చరించే వాడు కానీ వినేవాడు కాదు. ఇలా కొంతకాలం గడిచింది.

ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన పేద మిత్రుడు, వ్యాపారవేత్త అయిన ధనవంతుడు 10 సంవత్సరాల తరువాత ఒక రోజు హఠాత్తుగా ఆసుపత్రిలో కల్సుకొంటారు. ధనవంతుడు వ్యసనాలకు బానిసై ధనాన్ని అంతా దుర్వనియోగం చేసి రోగంతో అసుపత్రిలో చేరుతాడు.

పేద మిత్రుడు విద్యాలయానికి ప్రధానాధ్యాపకుడై లభించిన వేతనంతో ఆనందంగా భార్యబిడ్డలతో జీవిస్తూ సత్పరామర్శ నిమిత్తం వీలు కల్గినపుడు వైద్యాలయానికి కూడా వెళుతూ ఉంటాడు. ఆ విధంగా ఆసుపత్రిలో మిత్రుని స్థితి చూచి, జాలిచెంది అతనికి సహాయం చేసి రోగ విముక్తుడిని చేస్తాడు. అధిక సంపాదన కంటే సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకోగలవారు ధన్యులని ఈ కథ తెలియజేస్తోంది.

అసలైన లక్ష్మీ పూజ నీతిగా ధనార్జన చేయటం, ఉచితానచితాలు దృష్టిలో పెట్టుకొని సంపాదించిన దాన్ని సద్వినియోగం చేయటం. ధనార్జనకు ఎంత సద్భుద్ధి కావాలో దానికి అనేక రెట్లు ఎక్కువ సద్బుద్ధి ఉచితానుచితాలను తెల్సుకొని ధనాన్ని ఖర్చు చేయటానికి కావాలి.

ఒక రాజు ఒక మహాత్మునికి రత్నాలు వజ్రాలతో నిండిన తన ఖజనా చూపిస్తాడు. దానిని చూచి మహాత్నుడు రాజా! వీటి ద్వారా మీకెంత ఆదాయం లభిస్తోంది? అని ప్రశ్నిస్తాడు. ఈ ఖజానాను పదిలంగా రక్షించటానికి ఇంతో అంతో వ్యయమేగానీ ఆదాయం ఏమీ ఉండదని రాజు బదులు పల్కుతాడు.
మహాత్నుడు రాజుని వెంటబెట్టుకొని తీసికెళ్ళి ఒక గుడిసెలో ఒక స్త్రీ చూపిస్తాడు. ఆమె బండరాళ్ళను తిరగలిగా చేసుకొని పిండి విసిరి, ఆ విధంగా సంపాదించిన ధనంతో కుటుంబాన్ని పోషిస్తుంది.

నీ ఖజానాలోని రాళ్ళకంటే ఈ రాళ్లు ఎంతో నయం కాబట్టి వాటిని పరమార్థ ప్రయోజనానికి ఖర్చు చేసినట్లయితే వాటి రక్షణకై చేస్తున్న వ్యయాన్ని అరికట్టవచ్చునని మహాత్ముడు రాజుకి తెలియజేస్తాడు. రాజు ఆనందంగా అంగీకరిస్తాడు.

అశోక చక్రవర్తి తన జన్మదినంనాడు కోశాధికారులను పిలిచి, ఈ సంవత్సరం నేను ఎక్కువ మంచి పనులు చేసిన వారిని సత్కరించి బహుమానం ఇవ్వాలనుకొంటున్నాను. మీ మీ కోశొగారాల పరిస్థితి ఎలా ఉన్నదీ వివరించమంటాడు. ఉత్తర ప్రాంత కోశాధికారి, రాజా! నేను ఈ సంవత్సరం ఆదాయం 3 రెట్లు పెంచాను అని తెలియజేస్తాడు. దక్షిణ ప్రాంత కోశాధికారి రాజా! నేను ఖజనా నుండి ప్రతి సంవత్సరం పంపించే బంగారానికి రెట్టింపు బంగారాన్ని ఈ సంవత్సరం పంపించాను అంటాడు. తూర్పు భాగం కోశాధికారి తాను ఆ దిక్కున ఉండే అనేక మంది దొంగలను, దోపిడీదారులను హతమార్చినట్లు తెలియజేస్తాడు.

పడమర వైపు కోశాధికారి ప్రజల నుండి వసూలు చేసే పన్ను పెంచి, నౌకర్ల వేతనాలను తగ్గించి ఆదాయంలో అంతులేని ఉన్నతిని సాధించినట్లు తెలియజేస్తారు. ఆఖరుకు మధ్య ప్రాంత కోశాధికారి రాజుకి నమస్కరించి రాజా! నేను ఈ సంవత్సరం ఆదాయాన్ని ఏ మాత్రం పెంచలేకపోయాను, ఎందుకంటే నా ప్రాంతంలో నిరక్ష్యరాస్యతను నిర్మూలించటానికి కొన్ని పథకాలను చేపట్టవలసి వచ్చింది. అలాగే రైతుల సౌకర్యార్థం కొన్ని నూతులు, చెరువులు త్రవ్వించాను. ప్రజల కోసం రెండు ఆసుపత్రులు కట్టించటం తప్పనిసరి అయింది అని తెలియజేస్తాడు. రాజు అతడికి ప్రజల పట్ల గల ప్రేమాభిమానాలకు ఆనందిస్తూ ఆ కోశాధికారికే ఉత్తమ బహుమతినిచ్చి సత్కరిస్తాడు.

ఒక వ్యక్తి భక్త నానక్ కు నమస్కరిస్తూ, అయ్యా! ధనవంతులు అందరూ ఒకేవిధమైన వారు కాదు అనటంలో అర్థం ఏమిటి? కాస్త వివరంగా చెప్పుమని కోరతాడు. ఆర్జనను కేవలం సత్ర్పయోజనాలకే ఖర్చు చేసేవారు ఉత్తమ ధనవంతులు. ధనాన్ని ఎలా సదుపయోగం చేయాలో తెల్సి కూడా కూడబెడతారేగానీ ఖర్చు చేయలేరు. వీరిని మధ్యములంటారు.

ఇంక అధమ శ్రేణికి చెందిన ధనవంతులు ఆర్జించటం వదిలేసి వారసత్వంగానో, ఆయాచితంగానో సులభంగా లభించిన దాన్ని విచ్చలవిడిగా ఖర్చులు చేస్తూ దర్పం ఒలకబోస్తూ ఉంటారు. వీరే సమాజ పతనానికి కారకులు అంటూ వివిధ శ్రేణులకి చెందిన ధనవంతులు గురించి నానక్ తెలియజేస్తారు.

ఆర్జన పట్ల ఉపేక్ష గానీ అవినీతి గానీ తగదు. అలాగే ఆర్జించిన ప్రతి పైసా నిరాడంబరతోను సజ్జనత్వంతోను వ్యవహరిస్తూ సత్ఫలితాలను ఇస్తుందా లేదా అని సావధానంగా ఆలోచించి ఖర్చు చేయటం చాలా అవసరం. ఇలాకాని పక్షంలో ఐశ్వర్యం దారిద్ర్యం కంటే కూడా అనర్థాన్ని కల్గిస్తుంది.

“నారుపోసిన వాడు నీరు పోస్తాడులే ” అంటూ మన బాధ్యత దైవం మీద పడవేసి ఆర్జించకుండా కూర్చోవడం పొరపాటే. అలాగని మనలను మనమే ఉద్ధరించుకోగలం అనే అహంకారముతో ఉచ్ఛనీచాలు మరచి ఆర్జించటం తప్పే. సమన్వయం కావాలి.

ధనాన్ని “లక్ష్మి ” అనీ, “మాయ” అనికూడా అంటారు. సత్ర్పయోజనాలకు ఉపయోగపడే ధనం “లక్ష్మి ” గాను స్వార్థానికి, అవినీతికి ఉపయోగించబడే ధనం “మాయ” గాను పెర్కొనటం జరిగింది.

ముగ్గురు దొంగలకు ఒక ఇంట సమృద్ధిగా ధనం లభించింది. అడవిలోనికి పోయి ముగ్గురూ పంచుకోవాలని భావించారు. కానీ ఆకలి బాధకు తాళలేక ముందుగా వంట ప్రయత్నం ప్రారంభించారు. ధనం పట్లగల లోభంతో ఎవరికి వారు మిగిలిన ఇద్దరినీ చంపి తామే పూర్తి ధనాన్ని సంగ్రహించాలని ఆలోచిస్తారు. ఒకడికి తెలియకుండా మరొకడు భోజనంలోను మరొకరు త్రాగేనీటిలోను విషం కలుపుతారు. మూడవ దొంగ ఆయుధం సిద్ధంగా ఉంచుకొంటాడు. ఈ విధంగా ఒకరినొకరు మోసగించుకొని ముగ్గురూ మరణిస్తారు.

Leave a Comment