గురువు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు.

కధ [Story]:
ఆరుణి, ఉపమన్యు అనే బాలకులు ప్రామాణికతకు ప్రతిరూపాలు.
పొలం గట్టు తెగిందేమో చూచి రమ్మని గురువు ఘౌర వర్షంలో ‘ఆరుణిని’ పంపిస్తాడు. వెళ్ళేసరికి తెగిఉన్న పొలం గట్టు పూడ్చటానికి అరుణి చేసిన ప్రయత్నాలేవి ఫలించక ప్రవాహానికి అడ్డుగా స్వయంగా తానే పడుకొని నీటిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఎంతకీ తిరిగి రాని శిష్యుని వెదకుతూ వచ్చిన ధౌమ్య మహర్షి, శిష్యుని ప్రామాణికతను ప్రత్యక్షంగా చూస్తాడు. గురువు అప్పగించిన బాధ్యతను నిర్వహించటానికి ప్రాణాన్ని కూడా లెక్కచేయని ఆరుణికి తన తపోబలాన్ని ధారపోసి జీవన విద్యలో పారంగతుణ్ణి చేస్తాడు.
ఇదే విధంగా ఉపమన్యుని గురువు “విద్యాధ్యయనం” గోవులను మేపుతూ చేయమని ఆదేశిస్తాడు. భోజనానికి ఏర్పాటు చేయక, భిక్షాటన దగ్గరనించి ప్రతిపనీ తన ఆజ్ఞ లేకుండా స్వయంగా చేయరాదని నిర్దేశిస్తాడు. చివరకు ప్రాణంపోయే పరిస్థితి ఎదురైనా ఉపమన్యుడు ఆకలి బాధను భరిస్తాడే గానీ గురువు ఆజ్ఞను జవదాటడు. అతని నిష్ఠ పట్ల గురువు పెట్టిన పరీక్షలో ఉపమన్యుడు అగ్రశ్రేణిలో ఉత్తీర్ణుడై నిష్ఠాసంపదకు అధిపతి కాగల్గుతాడు.
ఈశ్వరానుశాసనాన్ని శిరసావహించిన వారు దిలీపునిలాగా, సమర్థ గురు రామదాసులాగా, గురునానక్, రామకృష్ణ పరమహంస లాగా ఇలాగే అనేక మంది మహాపురుషుల వలె, భగవంతుని అంతటి సామర్ధ్యంతోను, వైభవంతోను జీవించగల్గుతారు.
గుణకర్మ స్వభావాలలో పరివర్తన, అంతరంగంలో , నున్న దివ్యశక్తిపై విశ్వాసం, ప్రామాణికత యొక్క పరిచయం, వీటివల్ల మానవుడు తనలో ఈశ్వర ప్రకాశాన్ని, ప్రవేశాన్ని పొందగల్గుతాడు. వీటికోసం నిర్దేశింపబడిన ఉపాసన, సాధన, ఆరాధన అనే మూడు మార్గాలు అనివార్యం. వీటి పేరిట అనేక ప్రయత్నాల లక్ష్యం కూడా కేవలం వీటిని పొందటం కోసమే.
ఉపాసన, సాధన, ఆరాధన అను మూడు మార్గాల వెంబడి ఈశ్వరుడు జీవశక్తిలో ప్రవేశించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ దివ్య ప్రకాశాన్ని అనుసరించి సాహసంతో పయనించగల భక్త జనులకు మరి ఏ ఇతర ఆలంబనలు, సహాయాలు అక్కరలేదు. అన్నీ వైపులనుండి కోరకుండానే అనుకూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.
ఉపాసన
ఉపాసన అంటే ఆదర్శాల సంపదను పరబ్రహ్మకు వీలైనంత దగ్గరగా సమర్పించగల్గటం.
అతని ప్రేరణలను విలైనంత ఎక్కువగా ఆత్మగతం చేసుకోవటం. ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందుతున్నామనే భావన ఉపాసనకు చందన వృక్షం క్రింద మొలచిన ఇతర వృక్షాలవలె పరిమళ భరితం కానిస్తుంది. అగ్నికి దగ్గరగా పెట్టిన ఇంధనం క్రమంగా అగ్నిగా మారినట్లే ఉపాసన ద్వారా వ్యక్తి ఈశ్వరునిగా పరివర్తన చెంద గల్గుతాడు.