The Power of Simplicity, Integrity and Detachment
మహారాష్ట్రలో పేష్వా మాధవరావుకు గురువుగా, మంత్రిగా, ప్రధాన న్యాయాధీశునిగా అనేక పదవులను నిర్వహించే రామశాస్త్రి అనే యోగ్యుడైన బ్రాహ్మణుడు నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఆదర్శానికి ప్రతిరూపంగా జీవయాత్ర సాగించేవాడు. ఆయన భార్య ఒకనాడు సాధారణ జనులకంటె కూడా సాదా వస్త్రాలను ధరించి, ముఖ్యమైన పనిమీద రాణీ వద్దకు వెళ్ళటం జరిగింది. గురుపత్నిని ఆ స్థితిలో చూచిన రాణీ ఆశ్చర్యచకితురాలై, వారి ఆ దీనస్థితి రాజనిందకు కారణం కావచ్చునని భావించి గురుపత్నిని విలువైన వస్త్రాభరణాలతో అలంకరింపజేసి, ఆమె వచ్చిన పని పూర్తియైన తర్వాత, సాదరంగా పల్లకిలో కూర్చోపెట్టి ఇంటికి పంపిస్తుంది.
శాస్త్రీజీ తలుపు చప్పుడు విని, తలుపులు తెరచి ఆశ్చర్యచకితుడై ఈ స్త్రీ మూర్తి ఎవరో నాకు తెలియదని రాజమందిరాలకు వెళ్ళటానికి బదులు పొరపాటున ఈ పేద ఇంటికొచ్చి ఉంటుందని, దయచేసి రాజమందిరానికి తీసుకొని వెళ్ళమని బోయీలను కోరుతూ తలుపు మూసుకుంటాడు. శాస్త్రిగారి ధర్మపత్ని భర్త స్వభావం పూర్తిగా తెలిసి ఉండటంవలన వెంటనే రాణి మందిరానికి వెళ్లి ధరించిన వస్త్రాభరణాలను తిరిగి ఇచ్చివేసి యథాప్రకారంగా కాలినడకన ఇంటికి తిరిగి వచ్చింది.
తలుపు తెరచి శాస్త్రీజీ భార్యవంక ప్రేమ దృక్కులతో వీక్షిస్తూ, “దేవీ! బ్రాహ్మణుడు ఇతరులకు మర్యాదా పాలనను నేర్పుతూ, తన సహజమైన సంపద నిరాడంబరతతోనే ఆనందంగా జీవించాలి.” అని పలుకుతూ సాదరంగా లోనికి తోడ్కొనిపోతాడు. బ్రహ్మండమంతటి బ్రాహ్మణత్వానికి ప్రతిరూపమైన శాస్త్రీజీ పాదాలపై శిరస్సునుంచి ఆ ఇల్లాలు కన్నీటితో కాళ్ళు కడుగుతుంది.
అపరిగ్రహాన్ని అక్షరాలా పాటించిన బ్రాహ్మణులలో చాణక్యుడు, సుధాముడు అగ్రగణ్యులు. చంద్రగుప్తుని రాజ్య సింహాసనంపై కూర్చుండబెట్టి, విశాల భారత నిర్మాణాన్ని గావించిన చాణుక్యుడు అనంతమైన వైభవం, సిరిసంపదల మధ్య కేవలం ఒక ముతక వస్త్రాన్ని ధరించి, కూలిపోతున్న కుటీరంలో జీవయాత్ర సాగించిన బ్రాహ్మణుడు.
ఇతర దేశంలో ఒకసారి చాణుక్యుని మేధాశక్తిని కీర్తిస్తూ, దుశ్శాలువా కప్పి చాణుక్యుని సత్కరించగా, ఆయన వెంటనే దానిని ప్రక్కనేయున్న పని వారికి ఇచ్చి వేస్తాడు. సాదా జీవితానికి ప్రతిరూపమైన ఇటువంటి మహనీయులే చంద్రగుప్తుని వంటి శిష్యులను తయారు చేయగల సత్తా కల్గి ఉంటారు.
సుధాముడు జగన్నాయకుడైన కృష్ణునికి మిత్రుడు. ఒక గురుకులానికి కులపతి అయిన సాదా జీవితం జీవిస్తూ, బ్రాహ్మణ ధర్మ పాలనను తు.చ. తప్పకుండా నిర్వర్తిస్తాడు. అనంతమైన సంపదను, వైభవాన్ని పాదాలముందు కురిపించినప్పటికీ బ్రాహ్మణోచిత జీవితాన్ని సంపూర్ణ నిష్ఠతో పాటించటం వలన సుధాముని పట్ల కృష్ణుడు విశేషమైన ప్రేమానురాగాలు చూపించేవాడు.
