సందీపుడు కాశీరాజ కుమారుడు. ఆయన బ్రాహ్మీ మూహుర్తంలో నిద్రలేచి వ్యాయామం, గుర్రపుస్వారీ మొదలగువన్నీ చేసేవాడు. విద్య, విజ్ఞానం, పాండిత్యం, రాజకార్యాల పట్ల అపరిమితమైన శ్రద్ధ అన్ని విధాలైన శుభలక్షణాలతో క్రమశిక్షణలో పెరుగుతూండేవాడు. జీవితంలో ఒక్కక్షణాన్ని కూడా వృధా చేసేవాడు కాదు. ఒకనాడు ఈయన గుఱ్ఱం మీద బయలుదేరి నగరమంతా తిరుగుచుండగా నగర పౌరులు స్నేహానురాగాలతో అతడిని చుట్టుముట్టారు. ఇంతలో ఒక కుర్రవాడు ప్రమాదవశాన రాజకుమారుని గుఱ్ఱం డెక్క తగిలి నేలమీదపడి విలవిలలాడసాగేడు.
రాజకుమారుడు ఇదంతా ప్రత్యక్షంగా చూసికూడా కించిత్ వ్యధ చెందటంకానీ, సానుభూతి చూపటం గానీ చేయక జాగరూకతతో మెలగమని వారికి ఇటువంటి పరిస్థితులే ఎదురవుతాయంటూ నిర్లక్ష్యంగా ముందుకు సాగిపోయాడు.
రాజకుమారుని ఈ చర్యకు నగర ప్రజలు నిశ్చేష్ఠులయ్యారు. రాజకుమారుని నిరసించారు. ఈ విషయం విన్న రాజకుమారుని తండ్రి ఎంతగానో దుఃఖిస్తూ ఎన్ని ఉన్నప్పటికి అసలైన భావ సంవేదనలం తన కుమారునిలో కరువైన సంగతిని అవగతం చేసుకొంటాడు. వ్యక్తి కేవలం సక్రియుడై యధావిధిగా కార్యకలాపాలు సాగించినంత మాత్రాన జనాదరణకు, శ్రద్ధకు పాత్రుడు కాజాలడు.
ఇటువంటి వ్యక్తులు హఠాత్తుగా క్రూర కర్మలుగా మారినా మారవచ్చును అని గుర్తించి రాజు కుమారునికి గురుకులంలో విద్యాభ్యాసం శిక్షణ ఇప్పించే నిమిత్తం అన్ని ఏర్పాట్లు చేయించసాగాడు.
భారతీయ సంస్కృతి, చరిత్ర ద్వారా ఋషిపరంపర స్త్రీ పాత్ర గురించి మనకు స్పష్టంగా అవగతమవుతుంది. భారతభూమిపై ఉద్భవించిన ప్రతి మహాత్ముడు గురుకులాల్లో ఋషి పత్నులు, ఋషి కన్యల ద్వారానే పెంచి పోషించబడ్డారు. కణ్వాశ్రమంలో శకుంతల ద్వారా భరతుడు, వాల్మీకి ఆశ్రమంలో సీత ద్వారా లవకుశులు యే విధంగా పెరిగి పెద్దవారైనదీ మనందరకూ తెలుసును. మదాలస సంరక్షణలో పెరిగిన బిడ్డలు అద్వితీయమైన బ్రహ్మ జ్ఞానులు, భావ సంపన్నులు అవుతారు.
మాతృహీనులైన బిడ్డలు అనేక మంది భావశూన్యులుగానూ, సంవేదనా శూన్యులుగాను తయారై చుట్టూ ఎంతటి అనుకూల పరిస్థితులున్నప్పటికీ వాటిని చిందర వందర చేయటం జరిగింది. భావ సంవేదనా క్షేత్రంలో స్త్రీ, పురుషునికంటే ఎల్లవేళలా చాలా ముందుంటంది.
మహాత్ముడైన ఆనందస్వామి వద్దకు ఒక ధనవంతుడు వచ్చి, అయ్యా! నా వద్ద అనేక కార్ఖానాలున్నాయి. సంపద, సుఖాలతో నేను కన్న బిడ్డలందరూ నాకు దూరంగా తమ పనులలో తాము లీనమైయున్నారు. భార్య స్వర్గస్థురాలైంది. నా చుట్టూ వైభవ సామ్రాజ్యం తాండవమాడుతున్నా ఏదో కొరత నన్ను కలచివేస్తోంది. ఆకలి, నిద్ర నాకు దూరమయ్యాయి అంటూ రోదించసాగేడు.
ఆనందస్వామి ఆ ధనవంతుని కథ విని “నాయనా! నీవు నీ జీవితంలో శ్రమకు, కర్మకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి నీ చుట్టూ వైభవ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు. భావ సామ్రాజ్యాన్ని సంపాదించి పెట్టగల సత్సంగ, స్వాధ్యాయం వంటి వాటిని ఉపేక్షించావు. నీ ఆలోచనలకు శక్తి లభించి అంతరంగాన్ని శుష్కస్థితి నుండి బైట పడవెయ్యటానికి ఇకపైన ప్రేమను, శ్రమను పంచటం మొదలుపెట్టు. అనాథలు, నిర్థనుల మద్యకు వెళ్లి వారిని స్వావలంబులుగా మార్చటానికి శ్రమించు.
నీ శరీర శ్రమ ఎంత ఎక్కువగా ఈ పుణ్యకార్యంలో వెచ్చించగల్గితే అంతగానూ నీకు ఉల్లాసం, ఆనందం లభించి నీ ఆకలి, నిద్ర తిరిగి నీవద్దకు చేరుకుంటాయి అని తెలియజేస్తాడు. ధనవంతుడు మహాత్ముని ఆదేశాన్ని తూచా తప్పక అమలుపరుస్తాడు. గతంలో ఎన్నడూ పొందని ఆశ్చర్యకరమైన శాంతిని సత్ఫలితాలను పొంది ఆనంద సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు.
