పరమాత్మ ద్వారా లభించినవి ఏవీకూడా దాచిపెట్టకుండా నిరంతరం పంచుతూ ఉండాలి.
హాతిమ్ అనే ఆయన విదేశాలు వెళుతూ భార్యను పిలిచి, నేను తిరిగి వచ్చేవరకు నీకు ఏర్పాట్లు చూచి వెళ్ళాలిగా. తినటానికి ఎన్ని వస్తువులు ఎంతెంత తెచ్చి పెట్టాలని అడుగుతాడు. భార్య నవ్వి ఎంతని చెప్పను? నేను ఎంత కాలం జీవిస్తానో, ఆ జీవితకాలానికి సరిపడే పదార్ధాలు తెచ్చిపెట్టి వెళ్లు అంటుంది. భర్త ఆశ్చర్యం వ్యక్త పరుస్తూ, అదేమిటీ? నీ ఆయుష్షు నాకెలాతెల్సు అంటాడు. భార్య మళ్ళీ చిరునవ్వు నవ్వి, చూశారా మరి…. ఆయుష్షు తెలియని వాళ్ళకు సరియైన ఏర్పాట్లు మాత్రం ఎలాచేయగలరు? అది నిర్ణయించేవాడే ఆ ఏర్పాట్లు చూస్తాడు. నిశ్చితంగా వెళ్ళిరండి. నాకు తిండి పెట్టేవాడు ఇక్కడే ఉంటాడు. అన్ని వేళాల అతని శక్తి నాచుట్టూ నిండి ఉండగా నాకేమిలోటు? మీరు కూడా ఆయన పెట్టినది తినేవారే నంటూ ఆనందంగా సాగనంపుతుంది విదేశాలకు.
సాధన జ్ఞానం ధనం వైభవం గుణకర్మ రూపాల్లో మానవునకు తన తండ్రియైన పరమాత్మ ద్వారా లభించినవి ఏవీకూడా దాచిపెట్టకుండా నిరంతరం పంచుతూ ఉండాలి. శ్రేష్ఠుడు కావటానికి మొదటి షరతు ఇదే.
మేఘాలు సముద్రం నుండి ఆవిరి రూపంలో నీటిని గ్రహించి తిరిగి భూమిపైన సర్వత్ర వర్షిస్తాయి. అలా కాక తమవద్ద దాచేసుకుంటే సృష్టి సంతులనమే దెబ్బతింటుంది.
ఒక బావి సముద్రంపై అలిగి అయ్యా! నామీద నీ కెందుకంత పక్షపాతం? కాలువలకు, నదులకు అన్నిటికి నీలో చోటిచ్చి నాకు మాత్రం నీలో స్థానం లేకుండా వంచించావు కారణం ఏమిటని ప్రశ్నించింది కోపంతో.
సముద్రుడు సానుభూతితో, వత్సా! నీ మీద నాకేపక్షపాతమూ లేదు. నీవే నీ చుట్టూ గోడలు కట్టుకుని నీ జన్మసిద్ధి అధికారం నుండి వంచించబడుతున్నావ్. అనంతమైన నా ప్రేమను పొందాలనుకుంటే నీవు నీ హద్దులు తొలగించుకో. నీప్రవాహం ఎల్లలులేక ప్రవహిస్తూ భూమాతను పులకింపజేయటానికి ముందుకు ఉరికిన నాడు నీవు సహజంగానే నావరకూ ప్రవహించి నాలో విలీనమవుతావు. కాబట్టి నీచుట్టూ గోడలను ఛేదించుకొని బంధవిముక్తిరాలివి అవమంటాడు సముద్రుడు
మహా పరాక్రమవంతుడు పుణ్యాత్ముడు అయిన విద్రుఢుడనే ఆయన కాలాను గుణంగా దివంగతుడు అవుతాడు. ఆయన సత్కర్మల ఫలితంగా సుఖభోగాలు, స్వర్గం లభిస్తాయి. కానీ ఈయన దుఃఖిస్తూ ఉండేవాడు. ఒక రోజు సురపతి ఈయనను దుఃఖించటానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తాడు. విద్రుఢుడు కన్నీళ్లు తుడుచుకుంటూ మహేంద్ర! నాకు ఈ సుఖాలువద్దు. శాంతికావాలి. ఈ విలాసాలు అక్కర్లేదు. పరమార్థంలోని అనుభూతి కావాలి. ఇవి కావాలంటే నేను తిరిగి భూలోకానికి వెళ్లిపోవాలి. ఈ స్వర్గంలో అవేవిలేవు. అని బదులు పల్కుతాడు.
ఈ విషయం విన్న సురగురువు బృహస్పతి దేవసభలో విద్రఢుని కొనియాడుతూ దేవతలకంటే ఈ దేవమానవుడు శ్రేష్ఠుడు. స్వర్గం కంటే వీరి తపోలోకం శ్రేష్ఠమైనది. సేవాసాధనలు లేకుండా శాంతిని పొందలేని వీరి జీవితాలు ధన్యమైనవి అంటూ దేవతలకు తెలియజేస్తాడు.
తన సర్వస్వం పరమార్థానికి ఖర్చుచేసిన ఒక వ్యక్తి బాధ్యతను స్వయంగా భగవానుడే స్వీకరిస్తాడు. అతనికి ప్రతిరోజూ సమయానికి ఒక బంగారు పళ్లెంతో ఒక దేవదూత పంచభక్ష్య పరమాన్నాలు భోజనం తీసుకువచ్చి స్వయంగా తినిపిస్తూ ఉండేవాడు. ఇది చూసి మరొక వ్యక్తికూడా సన్యాసి వేషం ధరించి వచ్చి అతని ప్రక్కనే ఆసనం పరచుకుంటాడు.
మర్నాడు అతనికి భోజనం పళ్లెం వస్తుంది. కాని దానిలో ఎండిపోయిన రొట్టెలుంటాయి. ఇదేమి పక్షపాతం? అని సన్యాసి గద్దిస్తాడు. దేవదూత వినయంతో అయ్యా! పక్షపాతం ఏమీలేదు. మీ మీ సంచిత పుణ్య కర్మ ఫలితిలే ముందుకు వస్తూ ఉంటాయి. ఈయన తన సర్వస్వాన్ని ఇతరుల కోసం వెచ్చిస్తే మీరు ఈ మాత్రం ఎండు రొట్టెలనే ఇతరుల కొరకు వెచ్చించారు. అని బదులు పల్కుతాడు.
సన్యాసి వేషధారికి జ్ఞానోదయమైంది. తన దగ్గర ఉన్న రొట్టెను ఆకలిగొన్న ఒక కుక్కకు తినిపించి తాను ఆకలితో ఉండిపోతాడు. జ్ఞానంతో చేసిన ఈ త్యాగం వల్ల మర్నాడు అతనికి కూడా దేవదూత పిండివంటలతో భోజనాన్ని తెచ్చి తినిపిస్తాడు.
ఈశ్వరుని విశ్వసించే వారు తమ కర్మఫల విధానాన్ని కూడా విశ్వసిస్తారు. క్రియ ప్రతిక్రియల మధ్య ఏర్పడిన వ్యత్యాసానికి వారు చలించరు. ఈశ్వరుని పట్ల పరిపూర్ణ విశ్వాసం కల వ్యక్తులు అపారమైన శక్తిమంతులై ఉంటారు. అనర్థానికి చింతించరు. విరోధి గురించి భయపడరు. ఒంటరి తనానికి నిరాశ చెందరు. ఈశ్వరభక్తులు శక్తి మంతులై ఏదీ కోరక. యాచించక ఆ మహాశక్తితో సంబంధం పెట్టుకొని అంతటి వాడుగా పరిణితిచెందటానికి ప్రయత్నాలు సాగిస్తాడు. పూజలు అర్చనలు చేసి మనోవాంఛలు తీర్చుకోవాలని చూచేవారు లౌకికమైన సాధారణ మానవులేగానీ భక్తజనులుకాదు.
