They keep saying that the Supreme Being is present in every living being! What is the point of saying this if you can’t put it into practice?

పరమాత్ముడు ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు అని చెబుతూ ఉంటారు కదా! చెప్పేది ఆచరణలో చూపలేనపుడు ప్రయోజనం లేదు.

రాముడు శబరి పెట్టిన ఎంగిలి పండ్లు ప్రేమతో తింటాడు. నిర్జనారణ్యంలో నివసించే ఒక నిమ్నజాతి స్త్రీ యొక్క ఆతిథ్యాన్ని దైవం పరుగు పరుగున వెళ్లి స్వీకరించాడంటే, ఆమె సమర్పణ, ఆమె పవిత్రత కాక వేరే ప్రమాణం ఏమికావాలి?

కృష్ణ పరమాత్మ రుక్మిణి చేత తయారు చేయబడిన స్వాదిష్టభోజన పదార్థాల కంటే కూడా విదురుడు పెట్టిన ఫలహారం, ద్రౌపది ద్వారా అందించబడిన, అందరూ తినగా మిగిలిన ఆహారపదార్థములు ఎక్కువగా రుచించాయంటే అర్ధం దైవం తన అనుగ్రహాన్ని సుపన్నులు సమర్థులపైకాక సమర్పణగావించుకున్న నిశ్చల మనస్కులపై వర్షింపచేస్తాడని స్పష్టంగా అర్థమవుతోంది.

వ్యక్తులు జాతిరీత్యా వృత్తిరీత్యా నిమ్నజాతికి వృత్తికి చెందినట్లు కనబడినా, జ్ఞానం దృష్టితో చూస్తే సాధారణ స్థాయికి చెందినవారే అయినా అంతరంగంలోని ఔనత్యం కారణంగా అనేక మంది వ్యక్తులు ఈశ్వరానుగ్రహాన్ని పొంది మహాత్ములై లోకంలో కీర్తిప్రతిష్ఠలు పొందగలిగేరు. తుకారామ్, కబీర్, రామానుజాచార్యుడు వీరందరూ ఇటువంటి మహనీయులే.

ఒక గురువుగారికి ఇద్దరు శిష్యులుండేవారు. వారు నిత్యం ఈశ్వరారాధన తరువాత రోగులకి సేవచెయటంలో గురువుకి సహకరిస్తూ ఉండేవారు. ఒకరోజు సరిగ్గా పూజాసమయానికే ఒకరోగి బాధతో వస్తాడు. పూజ మధ్యలో ఉన్నది. పూర్తికాగానే వస్తామని శిష్యులు రోగికి తెలియజేస్తారు. ఇది విని గురువు శిష్యులను పూజ ఆపి ముందు రమ్మని ఆదేశిస్తాడు.

పూజ ఆపి ఎదురుగా వచ్చి నిలబడిన శిష్యులవంక చూస్తూ, “నాయనలారా! పూజలు, అర్చనలు, దేవతలు, అసురులు అనేకమంది చేయగల్గన సాధారణమైనవే. కానీ పీడిత మానవ సేవచేయగల అమూల్య అవకాశం మానవులకు మాత్రమే లభించింది. ప్రార్థన కంటే సేవ గొప్పది.

పూజ కంటే ప్రేమ గొప్పది. అర్చన కంటే ఆదరణే విలువైనది. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొందాం రమ్మని” వెంటబెట్టుకుని రోగివద్దకు తీసుకుని వెళతాడు.

సంత్ ఏకనాథ్ సాధువులతో కలిసి పవిత్ర గంగాజలాన్ని ప్రయాగనుండి రామేశ్వరానికి తీసికెళుతూ ఉంటాడు. దారిలో ఒక గాడిద దాహంతో చనిపోయే స్థితిలో ఉంటుంది. ఏకనాథ్ వెంటనే గంగాజలాన్ని తీసి గాడిద నోటిలో పోస్తాడు. మిగతా సాధువులు ఈ పనికి కోపించి ఏకనాథ్ ని నిందిస్తారు.

ఏక్నాథ్ వినయంగా వారికి నమస్కరించి మ, ” ఓ సత్పురుషులారా! పరమాత్ముడు ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు అని మీరంతా చెబుతూ ఉంటారు కదా! చెప్పేది ఆచరణలో చూపలేనపుడు ప్రయోజనం లేదు. ఏ నీటినైతే ఈ గాడిద త్రాగి బాధనుండి బయటపడిందో ఆ నీరు రామేశ్వరం చేరినట్లే కాబట్టి కోపాన్ని వీడండి” అంటూ సత్యాన్ని అవగతం చేస్తాడు.

సంత్ జ్ఞానేశ్వర్ చిన్నతనంలో ఒకసారి తన జన్మస్థలానికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామవాసులు జ్ఞానేశ్వర్ తండ్రిని సన్యాస ధర్మాన్ని వీడి గృహస్థాశ్రమం స్వీకరించాడనే నేరంతో గ్రామాన్నుండి బహిష్కరిస్తారు. జ్ఞానేశ్వర్ ఆ పెద్దలకు విద్వాంసులకు నమస్కరించి తనను తాను పరిచయం చేసుకుంటూ ఉండగా ఆ దారివెంట కొందరు గేదలను కర్రలతో కొడుతూ పొలాలకు తోలుకు పోతుంటారు.

గేదపై పడిన ప్రతి దెబ్బ జ్ఞానేశ్వర్ శరీరభాగాలమీద స్పష్టంగా కనిపించసాగింది. గ్రామ పెద్దలు ఆశ్చర్య చకితులవుతారు. జ్ఞానేశ్వర్ చిరునవ్వుతో “పెద్దలారా! దీనిలో ఆశ్చర్యమేమి లేదు. ఈశ్వరుడు ప్రతి ప్రాణిలోను నివసించటం వల్ల వాటి బాధ నా శరీరం ద్వారా కూడా వ్యక్తమవుతోంది; అంతే” నని చిరునవ్వు నవ్వుతాడు.

విద్వాంసులు మరింత ఆశ్చర్యంతో “అయితే నాయనా మనం చదివే వేదాలను గేదలతో పలికించ గలవా?” అని ప్రశ్నిస్తారు. ” ఓ తప్పకుండా” అంటూ జ్ఞానేశ్వర్ గేదలచేత తాను పలికినంత స్వచ్ఛంగాను స్పష్టంగాను వేదమంత్రాలు పలికిస్తాడు. గ్రామ పెద్దలు జ్ఞానేశ్వర్ను విరాట్ శక్తి స్వరూపుడిగా అంగీకరించి ఆ చిన్నవాని చరణాలపై వాలి తమ తప్పిదాలకు క్షమాపణ కోరుకుంటారు.

సంవత్సరాల తరపడి కౌస్తుభ మహర్షి, అతని ధర్మపత్ని ప్రతినిత్యం ఒక అతిథిదేవుని సత్కరించి భోజనం పెట్టటం వ్రతంగా పాటిస్తూ ఉండేవారు. ఒకరోజు ఎంత ప్రయత్నించినా అతిథి లభించలేదు. చివరకు వారి కుటీరానికి చాలా దూరంలో చెట్టుక్రింద ఒక కుష్ఠురోగి అయిన చండాలుడు వారికి కనిపిస్తాడు. దైవానికి ధన్యవాదాలు చెప్పి వారిద్దరూ వెళ్లి అతనికి నమస్కరించి తమ ఆతిథ్యం స్వీకరించమంటారు.

కాని అతడు “ఋషిదంపతులైన మీ ఆతిథ్యానికి అర్హత లేనివాడినని” భయంతో నిరాకరిస్తాడు. సర్వత్రా దైవాన్ని దర్శించ గల ఆ మునిదంపతులు అతని మాటలకు చిరునవ్వు నవ్వి మా దైవానివంటూ అతన్ని దగ్గరకు తీసుకుని ప్రేమతో తలనిమిరి కుటీరానికి వెంటబెట్టుకుని వెళతారు. అతని గాయాలకు కట్లుకట్టి సేవచేసి సాక్షాత్తు పరమాత్నుడే తమ ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నాడనే భావనతో అతనికి ఆతిథ్యాన్నిస్తారు. అణువణువునా సద్భావనలు నిండిన వ్యక్తులు సేవాధర్మాన్ని నిర్వర్తించకుండా జీవించలేరు.

Leave a Comment