పీడిత మానవ సేవని మించిన ఈశ్వరాధన ఎక్కడ ఉంది?
సంత్ నామదేవ్ ని, ఒక జిజ్ఞాసువు భగవంతుడిని చూపించమంటాడు. సాయంత్రం నాతో వస్తే తప్పక చూపిస్తానంటాడు. జిజ్ఞాసువు కుతూహలంతో ఎదురుచూచి పండ్లు, పూవులు వగైరా సరంజామాతో తరలివచ్చి నామదేవ్ వెంట నడక సాగిస్తాడు. దారిలో ఏ దేవాలయం దగ్గరో, ఏ ఆశ్రమాల దగ్గరో ఆగుతాడని ఆశించిన జిజ్ఞాసువుని ఆశ్చర్య చకితుని చేస్తూ సంతనామదేవ్ ఒక పూరిగుడిసె వద్ద ఆగేడు.
హరిజనవాడలో పూరిగుడిసెలో కుక్కిమంచంలో, క్షయరోగంతో పడి ఉన్న పది సంవత్సరాల పిల్లవాడిని చూపించి, దేవుడిదిగో మందు త్రాగించి సేవ చేయుమంటాడు. జిజ్ఞాసువు నమ్మలేక, స్వామీ! నాకు ఈశ్వర దర్శనం చేయిస్తానన్నారు కదా అని గుర్తు చేస్తాడు. నామదేవ్ పిల్లవానికి మందు త్రాగించి, అన్నం తినిపిస్తే “ఈ బాలుడు ఈశ్వరుడేనయ్యా! పీడిత మానవ సేవని మించిన ఈశ్వరారాధన ఎక్కడుంది చెప్పు ” అంటూ జిజ్ఞాసువుకు సత్యాన్ని ఎరుకపరుస్తాడు.
వేట నిమిత్తం ఆరణ్యంలో తిరిగే విక్రమాదిత్య మహారాజుకి త్రాగటానికి ఎక్కడా నీరు లభించదు. గొంతు ఎండిపోగా దాహం దాహం అంటూ వెదకసాగేడు. చివరకు ఒక కుటీరంలో ధ్యానమగ్నుడై ఉన్న ఒక మహాత్ముడు కనిపిస్తాడు. దప్పికకు తాళలేక కుటీరం ముందు రాజు మూర్చిల్లి పడిపోతాడు. కొంత సేపటికి సృహ తెలిసి రాజు కన్నులు విప్పేసరికి మహాత్ముడు రాజుకి సేవచేస్తూ కనిపిస్తాడు.
“అయ్యో స్వామీ! నా గురించి మీరు మీ సమాధిని భంగం చేసుకొన్నారా”! అని రాజు విచారిస్తాడు. మహాత్ముడు మధురవాణితో ఇలా అన్నారు. “వత్సా! దైవం ఆయన కుటుంబంలో ఎవ్వరు బాధపడినా సహించలేడయ్యా! ఒకే కుటుంబానికి చెందిన మనం ఒకరినొకరు ఆపదలో ఆదుకోవటం కంటే విశిష్టమైన సాధనలు, సమాధులు ఏమున్నాయి చెప్పు ” నా తండ్రి అయిన పరమాత్ముని కోరిక తీర్చటం నా ప్రథమ కర్తవ్యం. విచారించకు వెళ్లిరమ్మని ఆశీర్వదిస్తాడు. విక్రమాదిత్యుడు శిరసువంచి మహాత్మునికి నమస్కరిస్తాడు.
ఒకనాడు సంత్ జ్ఞానేశ్వర్ నది ఒడ్డున నడచి వెళుతూ ఉండగా నదిలో స్నానం చేసే కుర్రవాడు హఠాత్తుగా ప్రవాహంలో కొట్టుకు పోతూ, ‘రక్షించండి’ అని కేకలు వేస్తూ కనిపిస్తాడు. ఆ నది ఒడ్డునే కన్నులు మూసుకొని జపం చేస్తున్న సాధువు కేకలు విని ఒకసారి కన్నులు తెరచిచూచి మరల కన్నులు మూసేసుకొని జపం సాగిస్తూ ఉంటాడు. క్షణకాలంలో ఇదంతా గమనించి జ్ఞానేశ్వర్ అమాంతం నీటిలో దూకి బాలుని రక్షించి భూజాన వేసికొని ఒడ్డుకు చేరుకొంటాడు. సాధువు దగ్గరకు వెళ్లి “ఏమి చేస్తున్నావ్ ” అని ప్రశ్నిస్తాడు. జపం చేస్తున్నానంటాడు.
ఈశ్వర దర్శనం అయిందా అని మళ్ళీ ప్రశ్నిస్తాడు. సాధువు “మనస్సు స్థిరంకావటం లేదని బదులుపల్కుతాడు. “అయితే లేచి, ముందు దీనులకు, దుఃఖితులకు, ఆపదలలో అల్లాడేవారికి సేవచేయి. వారి కన్నీటిలో భాగం పంచుకో, ఇది చేయకుండా ఏ సాధనలు ఫలించవు” అని తెలియజేస్తాడు. మునిగిపోయే బాలుడిని రక్షించటం కంటే విశిష్టమైన ధ్యానం, జపం మరేదిలేదని గుర్తించిన సాధువు గంగ ఒడ్డు వదిలి సమాజంలోకి అడుగిడతాడు.
ఒక భక్తుడు ప్రతిరోజూ గంగ స్నానం చేసి, గంగాజలాన్ని వెంట తీసుకొచ్చి శివుడ్ని అభిషేకించే వాడు. ఒకనాడు మార్గ మధ్యంలో జ్వర పీడుతుడైన ఒక వ్యక్తి దాహం దాహం అంటూ, ఈ భక్తుని చేతిలోనున్న నీటిని కొద్దిగా పోయమని ప్రాధేయపడతాడు. దేవుడికి అభిషేకించటానికి తీసుకెళ్ళే ఈ పవిత్ర జలం ఛండాలుడివైన నీకు పోస్తే మిగిలినవి మైలపడతాయని చెప్పి భక్తుడు వడివడిగా గంగా జలంతో దైవ మందిరం చేరుకొంటాడు.
యధావిధిగా ఆరోజు కూడా ఆలయంలో పూజార్చనలు ముగించి ఇల్లు చేరిన భక్తునికి రాత్రి నిద్ర సమయంలో ఆలయంలోని తన దైవం జ్వరంతో వణుకుతూ కనిపిస్తాడు. ఏమిటిది స్వామీ! అంటూ భక్తుడు ఆత్రంగా ప్రశ్నిస్తాడు. మార్గమధ్యంలో, దాహంతో తపించే వ్యక్తికి దాహం తీర్చటానికి ఉపయోగపడని గంగాజలం కళంకమై అపవిత్రంగా మారి దానితో నన్ను అభిషేకించటం వల్ల నాకు రోగాన్ని కలుగచేసిందని దైవం దుఃఖిస్తూ బదులు పల్కుతాడు. భక్తుడు తన తప్పు తెలుసుకొంటాడు. దృష్టికోణాన్ని మార్చుకొని, ఈశ్వర భక్తి యొక్క అసలైన స్వరూపం పీడిత మానవ సేవగా గుర్తిస్తాడు.
ఈ విధంగా మానవుడు ఉపాసన, సాధన, ఆరాధన మార్గాలను స్వీకరించినపుడు ఉత్కృష్టమైన ఆలోచన రూపంలోను, ఉత్కృష్టమైన చరిత్ర రూపంలోను మానవులలో స్థిర నివాసం ఏర్పరచుకొని అనవరతము తనయొక్క అనుగ్రహంతో మానవులను పరశింపజేస్తాడు. ఇందులో ఎ మాత్రం సందేహం లేదు.
ఓ శ్వేత కేతూ! దైవంతో సంపర్కాన్ని భజనలు, పూజలు, సేవలు, స్తోత్రాలు వంటి అనేక మార్గాలతో పెట్టుకోవచ్చు. కానీ వ్యక్తి తనను తాను పవిత్రుడుగా మార్చుకొంటే తప్ప దైవానుగ్రహం లభించదు. మన పిలుపు వినిపించినా దైవం బదులు పలకడంలేదు అంటే మనం చేస్తున్నవి వ్యర్థ ప్రయత్నాలని గుర్తించాలి. తేజస్సు, నిశ్చలత్యం – ఈ రెండు షరతులకు మనం అర్హత సంపాదిస్తే పవరు హవుస్ నుండి విద్యుత్ ప్రవహించినట్టుగా సాధకునిలోని ప్రాణశక్తి అతనిలో వెలుగులు వెదజల్లుతుంది. నిజమైన భక్తి పాత్రత, ప్రఖరత మాత్రమే. మిగిలిన ఉపచారాలన్నీ కళేబరం మాత్రమే.