ఏమి పనిచేస్తున్నామనేది కాదు ముఖ్యం. ఏ భావనతో చేస్తున్నాము అనేది ప్రధానం.
ఒక రైతు అనేకమార్లు ఇంటికి వచ్చి భార్యను తినటానికి ఏమైనా పెట్టుమనిప్రతిరోజు వేధించేవాడు. ఆమె చిరాకుపడి భర్తను నిర్లక్ష్యం చేసేది. భార్యయొక్క ఉపేక్షా భావానికి రైతు దుఃఖిస్తూ ఈ సంగతి ఒకనాడు మిత్రునికి తెలియజేస్తాడు. మిత్రుడు ఆలోచించి రైతును మర్నాడు ఇంటికి వెళ్ళకుండా పొలంలోనే ఆపివేస్తాడు.
సరిగ్గా సూర్యుడు నెత్తిమీదకు వచ్చేసరికి రైతు భార్య స్వయంగా భోజనం వడ్డిస్తూ, ప్రతిరోజూ నీవు నీ కర్తవ్యాన్ని విస్మరించి తిండికోసం ఇంటి చుట్టూ తిరిగేవాడివి. కానీ ఈ రోజు నీ కర్తవ్యాన్ని గుర్తించి మనోయోగ పూర్వకంగా పనిచేసుకొంటున్నావు. మనోయోగ పూర్వకమైన నీ కర్తవ్య పరాయణత యొక్క ప్రతిఫలం ఇది. అంతేగానీ నా యొక్క అకాలవాత్సల్యం, చమత్కారం కాదని భర్తకు తెలియజేస్తుంది. వ్యక్తి యొక్క ప్రసన్నతకు సమృద్ధికి మూలకారణం ఏమిటో ఆనాడు రైతు భార్య మాటల ద్వారా గుర్తిస్తాడు.
శిష్య సమేతంగా పాదయాత్ర చేస్తున్న వివేకానందునికి దారిలో ఆలయ నిర్మాణంలో పనిచేస్తున్న ముగ్గురు కూలీలు కనిపిస్తారు. మొదటి కూలీని ఏమి పని చేస్తున్నావయ్యా! అని ప్రశ్నిస్తాడు. గాడిదలా రోజంతా చాకిరీ చేయించుకొని యజమాని చాలీచాలని డబ్బులు పడేస్తున్నాడని కూలీ బదులు పల్కుతాడు. రెండవ కూలీ విచారంగా మా జీవితాలు కూలీగా బ్రతుకుమని మాకు లిఖించి పెట్టేయి. ఆలయం నిర్మిస్తున్నాం అని పల్కుతాడు. మూడవ కూలీ ఆనందంగా వివేకానందుడికి నమస్కరిస్తూ, అయ్యా! భగవంతుడికి మందిరం నిర్మిస్తున్నాను. నా శ్రమ ఈ మహత్ కార్యాయనికి వినియోగింప బడడం వల్ల నాకెంతో ఆనందం లభిస్తోంది అని బదులు పల్కుతాడు.:
వివేకానందుడు ఆ ముగ్గురు కూలీలు పనిచేసే విధానంలోని తేడాను శిష్యుల దృష్టికి తీసుకొనివస్తూ చూశారా! నాయనలారా! ఈ ముగ్గురిలో మొదటి కూలీ గాడిదలా తప్పదురా అని పనిచేస్తున్నాడు. రెండవ కూలీ అదృష్టానికి ముడి పెడుతూ యాంత్రికంగా పనిచేస్తున్నాడు. మూడవ కూలీ పూర్తి సమర్పణ భావంతో పనిచేస్తున్నాడు. ఈ వ్యత్యాసమే వారి జీవితాలలో కూడా ఉంటుంది. ఏమి పని చేస్తన్నామనేది కాదు ముఖ్యం. ఏ భావంతో చేస్తున్నాము అనేది ప్రధానం. అని చెప్పి శిష్య సమేతంగా ముందుకు సాగుతాడు.
ఒక తల్లి కొడుకుతో, నాయనా! కష్టపడి పని చేసుకొంటేనే తిండి లభిస్తుంది. కాబట్టి ఏదైనా పనిచేసుకొని బ్రతకమని ఆదేశిస్తుంది. కొడుకు తల్లి ఆజ్ఞను శిరోధార్యంగా భావించి రాత్రి అంతా పనిచేసి తెల్లవారేసరికి తల్లిముందు సంచితో ధనరాసులు వెదజల్లుతాడు. తల్లి ఆశ్చర్య చకితురాలై ఒక్క రాత్రిలో ఇంత ధనాన్ని ఏమి పనిచేసి సంపాదించావని ప్రశ్నిస్తుంది. “ఎంతో శ్రమపడి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అతి కష్టం మీద ఒక ధనవంతుని ఇంట దొంగతనం చేసి ఈ ధనాన్ని సంపాదించి తెచ్చాను. నీవే కదమ్మా వ్యక్తి శ్రమశీలుడు కావాలని చెప్పేవు” అని పుత్రుడు బదులు పల్కుతాడు. తల్లి కొడుకుని శిక్షిస్తూ పరిశ్రమకు నిజాయితీ జోడింపబడినపుడే శ్రమ సత్ఫలితాలను ఇస్తుంది. వెంటనే వెళ్లి కొల్లగొట్టిన ధనాన్ని తిరిగి వారికి ఇచ్చివేయమని పంపిస్తుంది. కుమారుడు తన తప్పును తెల్సుకొని అపహరించిన ధనాన్ని తిరిగి ఇచ్చివేసి వారినుండి క్షమాపణ కోరుకొంటాడు.