అవినీతితో సంపాదించిన వారు ఆ స్థాయికి తగినట్లు విపత్తులలో చిక్కుకుంటారు.
అవినీతి ఆచరణ గావించేవాడే కాక అవినీతిగా ఆర్జించినవాడు అవినీతి సంపాదనతో ఆహారాన్ని స్వీకరించినవాడు ఇలా ప్రతి ఒక్కరు ఆ ఆ స్థాయికి తగినట్లు విపత్తులో చిక్కుకొంటారు.
ఒకసారి ఒక శిష్యుడు చిత్తవృత్తులను నిరోధించలేక వివశుడై గురుదేవుని పాదాలమీద వ్రాలి, గురుదేవా! మనసు చాలా అశాంతిగా ఉన్నది. చేసిన సాధన అంతా నిష్పలమై పోతుందని భయంగా ఉన్నదని రోదిస్తాడు.
ఆచార్యుడు కొంతసేపు ఆలోచించి నాయనా! మనస్సుకు సరాసరి సంబంధం ఆహారంతోనే ఉన్నది. నీవు తింటున్న ఆహారం ఎక్కడ నుండీ అపహరించి తెచ్చినది కాదుగదా? అని ప్రశ్నిస్తాడు.
శిష్యుడు ఆలోచించి, గురుదేవా! ఒక సేఠ్ అన్నదానం, అతిథి పూజ చేస్తుంటే ఈ మధ్య కొన్నాళ్ళుగా అక్కడ తింటున్నాను అని తెలియజేస్తాడు.
ఆచార్యునికి అవగతమవుతుంది. శ్రమించకుండా ఉచితంగా లభించినది తినటం, అది అవినీతి సంపాదన కావటం, ఈ రెండు కారణాలే శిష్యున్ని చిత్త చాంచల్యానికి కారణాలని అతనికి తెలియజేస్తాడు. నాయనా! ఆ సేఠ్ వృద్ధాప్యంలో ధనం ఇచ్చి ఒక పేద పిల్లను కొని వివాహమాడాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ అతిథి పూజ, అన్నదానం చేస్తున్నాడు. మరి ఆ తిండి తిన్న నీవు కూడా ఆ పాప ఫలాన్ని కొద్దో గొప్పో అనుభవించక తప్పదు. ఆత్మ కల్యాణాన్ని ఆశించే ప్రతివ్యక్తి కష్టించి నీతిగా ఆర్జించిన తిండి మాత్రమే తినటం అత్యంత ఆవశ్యకమైన నియమంగా గుర్తించుమని శిష్యునకు గురువు ఆదేశిస్తాడు.
గురునానక్ వద్దకు ఒకనాడు రెండు భోజనం పళ్ళెములు తీసుకుని రావటం జరిగింది. ఒక పళ్ళెంలో శ్రీమంతుని ఇంటినుండి తెచ్చిన పంచభక్ష్యాలు, రెండవ పళ్ళెంలో పేద రైతు ఇంటినుండి వచ్చిన జొన్న రొట్టె ఉంటాయి. జొన్న రొట్టెను నానక్ ప్రేమతో తినటం చూచి శిష్యులు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తారు. నానక్ రెండు పళ్ళెములలో పదార్థాన్ని చేతిలో పిండి శిష్యులకి చూపిస్తాడు.
పేదవాని ఎండు రొట్టె నుండి గోక్షీరం, ధనవంతుని ఆహార పదార్థాల నుండి ఎర్రని నెత్తురు ధారగా ప్రవహిస్తాయి. శిష్యులు ఆశ్చర్యానందాలతో నానక్ కు నమస్కరిస్తారు. ఈ విధంగా మహా మానవులు, దేవదూతలు జన సముదాయానికి అనేకసార్లు అవినీతి సంపాదనకు, కష్టార్జితానికి మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపించటం జరిగింది.
అవినీతి సంపాదనాపరులను అందల మెక్కించటం, ధనం లేనివారిని హీనంగా చూడటం ఈనాడు సమాజం యొక్క ముఖ్య లక్షణం. కానీ అవినీతి సంపాదనతో కలుషితమైన సమాజాన్ని రక్షించటం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించమని మహాత్ములు గొంతెత్తి ఘౌషిస్తున్నారు.
ఒకసారి గురునానక్ ఒక గ్రామంలో అడుగు పెట్టేసరికి అక్కడ 60 సంవత్సరాల ఒక సేఠ్, అంతక్రితం ఏడుగురు భార్యలు ఉండికూడా మరొక 16 సంవత్సరాల కన్యను వివాహమాడబోతూ ఉంటారు. ఇది నానక్ కు దుఃఖం కల్గించింది. “మంచి కార్యక్రమాలకి వినియోగించాల్సిన నీ డబ్బు తో ఇంకా ఎంత మంది స్త్రీలను కొనాలనుకంటున్నావ్? ” అని ప్రజల మధ్య సేఠ్ని నిలదీసి ప్రశ్నిస్తాడు.
సేఠ్ సిగ్గుతో తలవంచుకొంటాడు. ప్రజల నుద్దేశించి, ఓ ప్రజలారా! తన స్వార్థానికి ఒక వ్యక్తి అన్నెం పున్నెం ఎరుగని కన్యను బలిచేస్తూ ఉంటే చూస్తూ ఊరుకొన్నారంటే గ్రామవాసులంతా చనిపోయారా? అని ప్రశ్నిస్తాడు. ప్రజలు తమ కర్తవ్యాన్ని గుర్తిస్తారు. ధనవంతునితో విరోధించి ఇకపైన ఇలాంటివి జరగకుండా చూసుకొంటామని నానక్ కి మాట ఇస్తారు.
సిద్ధులు పొందిన వారమని గొప్ప కబుర్లు చెబుతూ శ్రమించకుండా పరాయి ధనాన్ని ఇతరుల ద్వారా సౌకర్యాలను అనుభవించే గురువులు, పెద్దమనుషులు కంటే పరాయి ధనాన్ని సర్పంగా భావించి కష్టించి జీవించి సాధారణ స్థాయికి చెందిన సాధకుడు అనేక రెట్లు గొప్పవాడు.
ఓ మహాత్మా! ఇంతవరకు నీ ద్వారా తెలియ జేయబడిన నాల్గు రకాల నియమోల్లంఘన నుండి తనను తాను కాపాడుకొన్నట్లయితే జీవన దేవతారాధన ఫలించినట్లేనా? అభీష్టసిద్ధి లభిస్తుందా? ఇంతకు మించి ఇంకా ఏమైన ఆచరించవలసిన ఉన్నాయా? దయతో మాకు తెలియ జేయండని శృంగి మహర్షిని ప్రార్థిస్తాడు.
దానికి మహర్షి ఏమన్నారంటే! ఓ భద్రజనుడా! ఇంతవరకు అపవ్యయాన్ని అరికట్టడం గురించి తెల్సుకొన్నారు. వినాశకర పరిస్థితులను సృష్టించే అపవ్యయాన్ని అరికట్టడం ఎంత ముఖ్యమో, ఆ విధంగా ఆదా చేసిన సంపదను సద్వినియోగం చేయటం అంతకంటే చాలా ముఖ్యం. ఈ రెండు ఒకటి పూర్వార్థం – రెండవది ఉత్తరార్థం. వీటిలో ఏది జరగక పోయినా ఆ పని వ్యర్థమే. నియమాల వల్ల వ్యక్తి లాభాన్వితుడు కావాలంటే ముదుగా వాటి స్వరూప స్వభావాలను అవగతం చేసుకోవాలి.
సూర్య కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. వాటి ద్వారా అందరకూ వేడి, ఉష్ణము లభించి సాధారణ లాభాలు చేకూరుతూనే ఉంటాయి. కానీ ఈ కిరణాలను భూతద్దం ద్వారా ఒక ప్రదేశానికి సమీకరించినట్లయితే అత్యంత శక్తివంతమైన విద్యుత్తు లభిస్తుంది. సూర్య కిరణాలను ఒక దగ్గర కి కేంద్రీకరించిప్పుడు అగ్ని ని కూడా పుట్టించవచ్చు. ఇదేవిధంగా అనేక శక్తులు వైజ్ఞానిక, కళాత్నక, సృజనాత్నక, శారీరక శక్తుల యొక్క విచ్చవవిడితనాన్ని అరికట్టి ఒక చోట కేంద్రీకరింప జేసినట్లయితే అనేక రెట్లు సత్ఫలితాలను ఇవ్వగల్గుతాయి.